గుంటూరు: ‘రజకుల చెరువును కాపాడాలి’ – రజక సేవా సంఘం డిమాండ్
గుంటూరు పరిధిలోని బుడంపాడు వద్ద ఉన్న రజకుల చెరువు ఆక్రమణకు గురైందని రజక సేవా సంఘం అధ్యక్షుడు జూపూడి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సంఘ ప్రతినిధులతో కలిసి ఆయన ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
రజకుల సంక్షేమం కోసం దశాబ్దాల క్రితమే ఈ చెరువును కేటాయించారని పేర్కొంటూ, ఇటీవల కొందరు అక్రమంగా ఆక్రమించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలు రజకుల జీవనాధారానికి ముప్పుగా మారుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి చెరువును పరిరక్షించడంతో పాటు అక్రమ ఆక్రమణలను తొలగించాలని రజక సేవా సంఘం డిమాండ్ చేసింది. చెరువు సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుని, రజకుల హక్కులను కాపాడాలని వారు కోరారు.