భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం కావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ఈ చారిత్రక ఘట్టం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా మారనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2014–2019 మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. మొత్తం పనుల్లో మిగిలిన కేవలం 4 శాతం పనులు కూడా ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి విమానాశ్రయాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కేవలం 18 నెలల వ్యవధిలోనే పనులను వేగవంతంగా పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.
ఈ ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి జాతీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ రంగం సహా వివిధ విభాగాల్లో అంతర్జాతీయ సంస్థల రాకతో పరిశ్రమల అభివృద్ధి వేగం పుంజుకోనుంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరిగి, యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఈ శుభసందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.